రాజకీయాల్లో తలుచుకుంటే సాధారణ జడ్పిటిసి నుండి ఏకంగా ముఖ్యమంత్రి స్థానానికి ఎదగవచ్చు అని నిరూపించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా పాలనలో తనదైన చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం…

కాలేజీలో విద్యార్థి నాయకుడిగా మొదలై

వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ( Anumula Revanth Reddy ) విద్యాభ్యాసం కూడా పెద్దపెద్ద యూనివర్సిటీలలో సాగలేదు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీలో చదివి బీఏ పట్టా పొందారు. అయితే కాలేజీ రోజుల్లోనే రేవంత్ రెడ్డికి రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏబీవీపీలో చేరి కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు సంపాదించారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఓ అడ్వటైజింగ్ మరియు ప్రింటింగ్ ఏజెన్సీని స్థాపించారు. ఆ సమయంలో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక సంచలనం. సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు.

మొదట జెట్పీటీసీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి

రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో సక్సెస్ సాధించిన ఆయన ఆ తర్వాత 2000 సంవత్సరంలో ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ గెలుపే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత తిరిగి ఆయన 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుండి జెడ్పిటిసి సభ్యుడుగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు.

జడ్పీటీసీ నుండి ఎమ్మెల్సీగా

ఆ మరుసటి ఏడాదే 2007లో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోను విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలో రేవంత్ ప్రస్థానం

టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2008 నుండి 2017 వరకు ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. రేవంత్ రెడ్డి మొదటిసారి 2009లో కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014లోనూ అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం తగ్గడంతో 2017లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఓటమి నేర్పిన పాఠంతో విజయంవైపు

2018లో ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తిరిగి 2019లో మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసే విజయం సాధించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ ఆ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. రేవంత్ రెడ్డి మాట తీరు విమర్శించే విధానం ప్రజలకు నచ్చడంతో ఆయనకు చాలామంది అభిమానులు అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందించింది. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆయన విజయపతంలో నడిపించి తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించడంతో అధిష్టానం ఆయననే సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆయన సేవలు అందిస్తున్నారు. అంతే కాకుండా మరో రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆ తరవాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని చెబుతూ ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. మరి ముందు ముందు ఆయన పొలిటికల్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది… ఎలాంటి పదవులు వర్తిస్తాయి అనేది చూడాలి.