డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ, నటుడు రాగ్ మయూర్ కాంబినేషన్లో వచ్చిన వినోదాత్మక సినిమా అనుమానపక్షి. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుండి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు క్రేజీగా ప్రమోషన్స్ చేయడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చిన అనుమానపక్షి ఆకట్టుకుందా? లేదా? అనేది చూద్దాం…
కథనం..
సన్నీ (రాగ్ మయూర్) అనే వైజాగ్ కుర్రాడు ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆలోచిస్తూ అందరిని అనుమానించే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ క్రమంలో సన్నీ తన అనుమానాన్ని ఒక కాన్సెప్ట్ గా మార్చుకుని అనుమాన పక్షి పేరుతో ఒక ఛానల్ పెడతాడు. ఈ క్రమంలో కాశ్మీర్ లో ఉంటున్న అతని స్నేహితుడు ఆనంద్ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తాడు. దీంతో అతడిని రక్షించేందుకు సన్నీ తన మరి కొంత మంది స్నేహితులతో అక్కడికి బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో అతడికి కన్యాకుమారి (హీరోయిన్ )అనే యువతి పరిచయం అవుతుంది. అదే సమయంలో సన్నీ మరో స్నేహితుడు అక్కడ విచిత్రమైన పరిస్థితిలో చనిపోతాడు. అయితే ఆ చావుకు కారణం తానేనా అనే అనుమానంలో హీరో ఉంటాడు. స్నేహితుడు మరణించిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత కథలో అనేక మలుపులు ఉంటాయి. అసలు సన్నీ స్నేహితుడు ఎలా మరణించాడు. కథలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సినిమా…
సాంకేతిక విశ్లేషణ దర్శకత్వం& స్క్రీన్ ప్లే:
డీజే టిల్లు సినిమాతో డైరెక్టర్ విమల్ కృష్ణ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అనుమాన పక్షి కాన్సెప్ట్ బాగానే ఉన్నా తెరమీద చూపించడంలో తడబడినట్టు కనిపించింది. సినిమా మొదలైనప్పటి నుండి కూడా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వలేక పోతాడు. ఒక క్రైమ్ కామెడీని తీయాలనే ఉద్దేశం డైరెక్టర్ కి ఉన్నట్టు కనిపించినప్పటికీ దానిని తెరపై చూపించడంలో స్పష్టత కరువైనట్టు కనిపించింది. సన్నివేశాల మధ్య సరైన ఫ్లో లేనట్టు అనిపించడంతో ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. కామెడీ అనేది సినిమాలోని పాత్రల చుట్టూ సహజంగా పుట్టాలి. కానీ ఇందులో కావాలని కామెడీని క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది. సినిమాలో పాత్రల డిజైనింగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఏ క్యారెక్టర్ కు కూడా సరైన ముగింపు కనిపించదు. బ్రహ్మాజీ, అజయ్, రాశీ లాంటి సీనియర్ నటీనటులు ఉన్నప్పటికీ వాళ్లతో బలమైన వినోదాత్మక సన్నివేశాలు కనిపించవు. హీరోయిన్ పాత్ర అతిథి పాత్రలానే మిగిలిపోయింది.
నటీనటుల పనితీరు:
సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రాగ్ మయూర్ తన నటన, ఎక్స్ప్రెషన్స్ మరియు కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో మెరిన్ హీరోయిన్ గా నటించగా చూడ్డానికి అందంగానే కనిపించిన ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఆమెకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంది. ఇక ప్రిన్స్ సిసిల్, చరిత్ తమ పాత్రల పరిధిమేర నటించారు. బ్రహ్మాజీ, రాశి, అజయ్ లాంటి నటులు ఉన్నా వారిని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు.
సంగీతం:
ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. క్రైమ్ కామెడీ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం అనే చెప్పాలి. ఈ సినిమాలోను అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది.
సినిమాటోగ్రఫీ& నిర్మాణం:
ఈ సినిమాకు సునీల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. సన్నివేశాలను ఆయన కలర్ ఫుల్ గా చూపించగలిగారు. దీంతో సినిమా చూస్తున్నంత సేపు ఒక భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ :
సినిమాకు రాగ్ మయూర్ నటన కామెడీ టైమింగ్ కాస్త ప్లస్ అయ్యాయి.
ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా కథ మైనస్ అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే సైతం ఈ సినిమాకు మైనస్ అయ్యింది. హీరోయిన్ కు స్క్రీన్ స్పేస్ తక్కువ ఇవ్వడం, మంచి కాన్సెప్ట్ తో వచ్చినా సరిగా చూపించలేకపోవడం మైనస్ అయ్యాయి.



