తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “సిగ్మా”. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. తమిళ స్టార్, సీఎం విజయ్ కుమారుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? మొదటి సినిమాతో కుర్ర డైరెక్టర్ సక్సెస్ అయ్యాడా? అనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం…

 

కథనం :

గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకార్థం ఒక లైబ్రరీని నడుపుతుంటాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం, తీవ్రమైన అప్పుల్లో కూరుకపోవడం జరుగుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు అతడిని వేధిస్తూ ఉంటారు. ఆ అప్పును తీర్చేందుకు గురు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతాయి. ఈ క్రమంలోనే గురుకు వేలకోట్ల ఆస్తులు ఉన్న డ్రగ్స్, కెసినో లాంటి వ్యాపారాలు చేసే వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్), విన్సెంట్ అనే ఇద్దరు బడా బాబులతో గొడవ జరుగుతుంది. దాదాపు 1000 కోట్ల విలువచేసే ఒక రహస్య కంటైనర్ తెరిచే తాళం మరియు పెన్ డ్రైవ్ విన్సెంట్ వద్ద ఉంటాయి. ఈ క్రమంలో పోలీసు దాడి నుండి వీరయ్య తప్పించుకోవడంతో ఆ కంటైనర్ కీ కోసం వెతకడం ప్రారంభిస్తారు. అయితే అనుకోకుండా ఆ సమాచారం గురుకు తెలుస్తుంది. దీంతో గురు తన స్నేహితురాలు సామ్ (ఫరియా), డాక్టర్ (రాజు సుందరం) తో కలిసి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతడు మాఫియాని బెదిరించి ఆ డబ్బును దోచుకోగలిగాడా? లేదా? తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ.

నటీనటుల పనితీరు:

సందీప్ కిషన్ గురు పాత్రలో అంతగా మెప్పించలేకపోయాడు. సినిమా కథలో బలం లేకపోవడం సన్నివేశాలు చప్పగా ఉండటంతో సందీప్ కిషన్ నటన కూడా పేలిపోయినట్టే కనిపిస్తుంది. మరోవైపు ఫరియా అబ్దుల్లా తన పాత్రకు న్యాయం చేసింది. మాఫియా డాన్ గా సంపత్ రాజ్ అద్భుతంగా నటించాడు. డాక్టర్ పాత్రలో రాజు సుందరం కామెడీని పండించలేకపోయాడు. మిగతా నటులు తమ పరిధి మేర నటించారు.

సంగీతం:

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సాంకేతిక విశ్లేషణా దర్శకత్వం& స్క్రీన్ ప్లే:

క్రైమ్ ట్రిల్లర్ సినిమాల్లో స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రాసుకున్న కథను ఆసక్తికరంగా తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం వరకు ఓకే అనిపించినా… ముందుకు వెళ్లే కొద్దీ సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని పాత్రలు అనవసరంగా వచ్చాయనే భావన కలుగుతుంది. మరో వైపు కొన్ని సన్నివేశాలు సిల్లీగా విసుగు తెప్పించేలా ఉంటాయి. స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు తడబడినట్టు అర్థం అవుతుంది.

సినిమాటోగ్రఫీ & నిర్మాణం:

సినిమాలో విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కానీ సన్నివేశాల్లో పస లేకపోవడంతో ఆ ఫీల్ కనిపించదు. మరోవైపు బడానిర్మాణ సంస్థ కావడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్:

సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సంగీతం, ఫరియా నటన, కొన్ని సన్నివేశాలు మాత్రమే సినిమాకు ప్లస్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా సన్నివేశాలు లాగ్ అయ్యాయి. సెకండాఫ్ గందరగోళంగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

ముగింపు: ఈ సినిమా ప్రేక్షకుడికి ఒక పరీక్ష