కోర్ట్ సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రాడు హర్ష రోషన్. ఈ సినిమా విజయం తర్వాత వరుస పెట్టి టీనేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో రోషర్ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే “తెల్లగాగితం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రోషన్ కు జోడిగా నక్షత్ర హీరోయిన్ గా నటించగా.. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. మరి కోర్టు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రోషన్ మరో హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…
కథనం:
ఈ సినిమా కథలోకి వెళితే భీమవరం దగ్గరలోని వీర వాసరం అనే ఒక ఊర్లో జరిగే కథే ఈ సినిమా. 2006 సంవత్సరంలో హీరో హీరోయిన్ పదవ తరగతి చదువుకుంటారు. టెన్త్ క్లాస్ లో ఉన్న సమయంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంటర్ లోకి వచ్చిన తర్వాత ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారిపోతుంది. అయితే తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ జంట దానిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో తన మామయ్య ఇచ్చిన ఒక సలహాతో ఒక తప్పు చేసి ప్రేమను వ్యక్తపరుస్తాడు. హీరోయిన్ కూడా హీరో ప్రపోజల్ కి ఓకే చెబుతుంది. అయితే ఇంతలోనే వీరిద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తాడు. అతనితో హీరోయిన్ ను చూసి హీరో తట్టుకోలేక పోతాడు. దీంతో మరోసారి హీరో వెళ్లి తన మామయ్య సలహా అడుగుతాడు. ఈసారి తన మామ ఇచ్చే ఐడియాతో హీరో మరో తప్పు చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎలా రియాక్ట్ అయింది? అసలు ఏం జరిగింది? తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది.. ఇతరుల మాటలు వినడం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి? టీనేజ్ లో ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకే ఎందుకు చెప్పాలి అనేదే ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు:
కోర్ట్ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోనూ రోషన్ టీనేజ్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. వయసుకు తగిన అమాయకత్వాన్ని, గందరగోళాన్ని తన హావభావాల్లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ గా నక్షత్ర అందంగా కనిపించడంతోపాటు తన నటనలోనూ సహజత్వంతో మెప్పించింది. స్నేహితుడి పాత్రలో నటించిన దీపక్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రావ్య తమ పాత్రలలో చక్కగా నటించారు. అదేవిధంగా తండ్రి పాత్రలో అజయ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
సాంకేతిక విశ్లేషణ దర్శకత్వం & స్క్రీన్ ప్లే:
ఈ సినిమా కూడా కోర్టు సినిమా మాదిరిగానే ఒక మెసేజ్ ఓరియంటెంట్ సినిమా. ఏదైనా సమస్య వస్తే తల్లి దండ్రులకు తప్ప ఇతరులకు చెప్పకూడదు అనే సందేశంతో తెరకెక్కింది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ గా సెకండ్ హాఫ్ కాస్త బోరింగా సాగుతాయి.
సంగీతం:
ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా పాటలను ఆయన చక్కగా మలిచారు. ఇందులోని చిలక, తెలుసా తెలుసా… అనే పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సినిమాటోగ్రఫీ & నిర్మాణం
ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి. గుహన్ పనిచేశారు. భీమవరం చుట్టుపక్కల ఉండే గ్రామాల అందాలను ఆయన కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇక చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ & మైనస్ పాయింట్స్:
ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే.. నటీనటుల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా వినోదాత్మకంగా సాగింది. సెకండాఫ్ లో సినిమా క్లైమాక్స్ అద్భుతంగా, ఎమోషనల్ గా సాగింది.
సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. సినిమా కథాంశం రొటీన్ గా అనిపిస్తుంది. చాలా సినిమాల్లో చూసినట్టుగానే యువత చెడు మార్గంలో వెళ్లడం , తప్పులు చేయడం సాధారణ కాన్సెప్ట్ లా అనిపిస్తుంది. సెకండాఫ్ ఎక్కువగా సాగదీసినా కొన్ని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూసినట్టు అనిపించడం బోరింగ్ గా అనిపిస్తుంది.
ముగింపు& తీర్పు:
ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒక పల్లెటూరి ప్రేమ కథ చిత్రం చూడాలి అనుకుని వెళ్లే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.



