క్రేజీ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణంలో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. రాజమౌళి కుమారుడి నిర్మాణంలో వచ్చిన సినిమా కావడం, ఫహద్ హీరోగా నటించడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథనం:

సినిమా కథ విషయానికి వస్తే సూరి (ఫహద్ ఫాజిల్) ఒక అనాధ. సూరి తన స్నేహితుడు వెంకటేష్ తో కలిసి జీవిస్తూ ఉంటాడు. జీవితంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి పాతబస్తీలో ఓ గ్యాంగ్ స్టర్ అస్లాంతో గొడవ జరుగుతుంది. అయితే రెండు రోజుల్లో 25 లక్షలు కట్టాలని లేదంటే చంపేస్తానని ఆ గ్యాంగ్ స్టర్ హీరోకు వార్నింగ్ ఇస్తాడు. బతుకు మీద తీపితో ఎవరినైనా కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలని హీరో భావిస్తాడు. ఈ క్రమంలో దివ్య (సారా పాలేకర్) చిన్నారిని హీరో కిడ్నాప్ చేస్తాడు. చిన్నారిని కిడ్నాప్ చేసిన తర్వాత హీరో జీవితం తలకిందులు అవుతుంది. అలా ఎందుకు తలకిందులు అవుతుంది? అసలు సూరి దివ్యనే ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. చివరికి కథలో ఏం జరిగింది? అనేదే ఈ సినిమా..

నటీనటుల పనితీరు

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. సూరి పాత్రలో ఒదిగిపోయాడు. దివ్య పాత్రలో చిన్నారి సారే పాలేకర్ కూడా అద్భుతంగా నటించింది. మరోవైపు వెంకటేష్ పాత్రలో నటించిన నటుడు, సుబ్బరాజు మహేష్ మంజ్రీకర్ సైతం తమ నటనతో మెప్పించారు.

సాంకేతిక విశ్లేషణ దర్శకత్వం & స్క్రీన్ ప్లే:

సినిమా ప్రారంభంలో హీరో క్యారెక్టర్ ను దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తాడు. హీరో ఎలాంటివాడు డబ్బు కోసం ఎందుకు దిగజారుతాడు.. అనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులను మాయం చేశానని భావిస్తూ వాళ్లను వెతికి తీసుకురమ్మని వెంటపడుతున్న విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఇంటర్వెల్ వరకు అసలు విషయాన్ని సాగదీయడం కొంత విసుగు తెప్పిస్తుంది. అసలు విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ కథను సైతం ముందుకు తీసుకెళ్లకపోవడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అక్కడక్కడే కామెడీ సన్నివేశాలు వచ్చినప్పటికీ నవ్వడం కంటే.. కథ ముందుకు సాగడం లేదనే భావన కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చిన తర్వాత మాత్రం సినిమా కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. ఆ ఎమోషన్స్ ను కూడా దర్శకుడు పూర్తిస్థాయిలో పండించలేకపోయాడు.

సంగీతం:

ఈ సినిమాకు కాలభైరవ అందించిన మ్యూజిక్ ప్రాణం పోసింది. సినిమాలోని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

సినిమాటోగ్రఫీ& నిర్మాణం:

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. అయితే సినిమా ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది.

ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ :

ఫహద్ ఫాజిల్ ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అయింది. సినిమాలోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, పాప మరియు ఫహద్ మధ్య ఉండే సీన్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం ఈ సినిమాకు ప్లస్ అయింది.

సినిమాలో మైనస్ ల విషయానికి వస్తే కథ ముందుకు జరగకపోవడం.. అక్కడికక్కడే కామెడీ పండించే ప్రయత్నం చేయడం సినిమాకు మైనస్ అయింది. కొన్ని సన్నివేశాలు చాలా లాగ్ అవ్వడం కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

ముగింపు: డోంట్ డ్రబుల్ ది ట్రబుల్ అంచనాలతో వెళితే ట్రబులే