చంద్రబాబు నాయుడు.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న జన హృదయ నేత. ప్రజలను తెలుగు తమ్ముళ్లు, అక్క చెల్లెలు అంటూ పలకరించే చంద్రబాబు పాలన కూడా అదే విధంగా సాగుతుంది. రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు పరిపాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఎంతోమంది ఐటీ రంగంలో స్థిరపడటానికి చంద్రబాబు వేసిన పునాదే కారణమని చాలామంది చెప్పుకుంటారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఇప్పటికి టెక్నాలజీ గురించే మాట్లాడుతూ ప్రపంచంతో పరుగులు పెట్టాలని యువతకు ఆదర్శంగా నిలుస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగం అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రానికి డేటా సెంటర్లను తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను ఏఐ హబ్ గా మారుస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎలా రాణించారు…? ఎలాంటి విజయాలు అందుకున్నారు..? అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
అతి చిన్నవయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు
చంద్రబాబు ( Nara Chandra Babu Naidu ) మొదటిసారి 1978లో అత్యంత పిన్నవయస్కుడైన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా కేవలం 30 ఏళ్ల వయసులోనే సీఎం టి.అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అత్యంత చిన్న వయసుడైన మంత్రిగా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. విద్యార్థి దశలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఎదిగారు.
యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి
మొదట పులిచెర్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత చిత్తూరు జిల్లాలో యువతను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. యువ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లగు పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా సేవలు అందించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆనాడే పునాది వేశారు. 1983 ఎన్నికల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన రెండేళ్లకే టీడీపీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు టీడీపీని నడిపించడంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. యువతను పార్టీ వైపు తిప్పడం… నెట్వర్క్ ను పెంచడంతో కీలక యువ నేతగా పార్టీలో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు యువతను ఆకర్షించి పార్టీని బలోపేతం చేయడం వల్లనే ఆ తర్వాత ఎన్నికల్లో వరుస విజయాలు అందుకుంది.
1994 ఎన్నికల గెలుపులో చంద్రబాబు పాత్ర కీలకం
1994లో టీడీపీ ( TDP ) అధికారంలోకి రావడానికి చంద్రబాబు పాత్రే ప్రధానమైనది. అప్పట్లో టీడీపీలో బయట వ్యక్తుల ప్రమేయం పెరగడం వల్ల 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఎన్టీఆర్ స్థానంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల తరబడి ఆఫీస్లకే పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకే పాలన అంటూ 1995 నవంబర్ 1న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరిన్ని పథకాలు తీసుకువచ్చి సంస్కారం కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో నడిపించారు.
ఇప్పటికీ అదే జోష్, అదే నిబద్ధత
70 సంవత్సరాలు వచ్చినా చంద్రబాబు ( CBN ) అలసిపోకుండా ఇప్పటికీ అదే ఉత్సాహం .. అదే నిబద్ధతతో పని చేస్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా ముందుచూపు ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం మరో 20 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి అనేది నిర్ణయాలను ఇప్పుడే తీసుకుంటారు. టెక్నాలజీతో పరుగులు పెట్టడం వలన అభివృద్ధి సాధ్యమని నమ్ముతూ ఆ వైపే యువత అడుగులు వేసేలా చేస్తారు. ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం కంటే సొంతగా ఉపాధి కల్పిస్తూ వారి కాళ్ళ పైన వాళ్లను నిలబడేలా చేయడమే రాష్ట్రానికి మంచిదని భావిస్తారు.



