సాధారణంగా భారీ అంచనాలు ఉన్న చిత్రాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కుతూ ఉంటాయి. ఈ ఏడాది కొన్ని ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. 2026లో మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన టాప్ 9 చిత్రాలు ఏవో తెలుసుకుందాం.

ధురంధర్ 2 ( Dhurandhar 2 )

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సీక్వెల్‌కు కూడా విడుదలైన మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో.. మొత్తంగా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.204 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది.

టాక్సిక్ ( Toxic )

యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. దీంతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.143.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

పెద్ది ( Peddi )

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం మొదటి రోజు రూ.117.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి మూడో స్థానంలో నిలిచింది.

ది రాజా సాబ్ ( The Rajasaab )

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రీద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, మారుతి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ, మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే రాబట్టింది. ఈ సినిమాకు మొదటి రోజు రూ.101.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. దీంతో ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది.

జన నయాగన్ ( Jananayakudu )

తలపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, హెచ్. వినోత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రూ.81.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ది ప్యారడైజ్ ( The Paradise )

నాని, కయదు లోహార్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ మొదటి రోజు రూ.78.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఆరో స్థానంలో నిలిచింది.

మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Varaprasad Garu )

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.74.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో ఈ మూవీ ఏడో స్థానంలో నిలిచింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ( Usthad Bhagath Singh )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ మొదటి రోజు రూ.52.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, ఈ ఏడాది అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

దృశ్యం 3 ( Drushyam 3 )

మోహన్‌లాల్, మీనా జంటగా తెరకెక్కిన ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్ట్ జీతూ జోసఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకకాలంలో మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.42.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.