తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతల్లో ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసీఆర్). యవ్వనం నుండే రాజకీయాలపై ఆసక్తి ఉన్న కేసీఆర్ స్టూడెంట్ లీడర్ గా తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల కళ స్వరాష్ట్ర సాధన అని తెలుసుకొని రాష్ట్ర సాధన కోసం ఉద్యమ గొంతుకగా మారారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపించడంలో ముఖ్యపాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనే తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. ఆ తర్వాత 2019లో వచ్చిన ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించి మరోసారి సీఎంగా పని చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రతిరోజు ప్రజల గొంతులో వినిపిస్తూనే ఉంటారు. ఇలా కేసీఆర్ రాజకీయ జీవితం గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి కేసీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నట్టే పర్సనల్ లైఫ్ లోనూ అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
తెలుగులో ఎంఏ పట్టా
కేసీఆర్ (KCR ) ప్రసంగం మొదలుపెడితే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. అది ఆయన భాషకు ఉన్న పవర్. తెలుగులో సామెతలు, కథలు చెబుతూ కేసీఆర్ తన ప్రసంగంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తారు. ఆయనకు ముందునుండే సాహిత్యం పై ఉన్న ఆసక్తితో తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా ఓ విద్యావంతుడు మరియు సాహితీవేత్త కూడా.. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా సైతం పొందారు.
న్యూమరాలజీలోనూ పట్టుంది
కేవలం తెలుగు సాహిత్యం లోనే కాకుండా న్యూమరాలజీ లోనూ ఆయనకు పట్టుంది. జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు శాస్త్రం పై కేసీఆర్ కు ఎంతో నమ్మకం ఉంది. ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి కేసీఆర్ కాన్వాయ్ లోని వాహనాల నంబర్లు కూడా ఆరు. అంతేకాదు కేసీఆర్ ముఖ్యమైన జీవోల విషయంలోనూ 6 నెంబర్ వచ్చేలా చూసుకుంటారట. అంతేకాదు కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్- 02 -2014 మధ్యాహ్నం 12: 57 గంటలు దీన్ని కూడా లెక్కిస్తే లక్కీ నెంబర్ 6 వచ్చేలానే ముహూర్తం నిర్ణయించారు.
రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారం
కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నడిపించారని ఓ టాక్ ఉంది. ఈ కన్సల్టెన్సీ ద్వారా గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపించేవారని ఆయన స్నేహితులు, పరిచయస్తులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సీఎంగా ఎన్నికైన తర్వాత గల్ఫ్ కార్మికుల కష్టాలు తీర్చడానికి ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వ్యవసాయం పై ముందు నుండే ఆసక్తి
కేసీఆర్ రాజకీయాల్లో ఉద్యమంలో ఎంత బిజీగా ఉన్నా వ్యవసాయం పై ఆయనకు ఉన్న ఇష్టంతో ఎక్కువ సమయం వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతుంటారు. కేవలం పనివాళ్లని పెట్టి వ్యవసాయం చేయకుండా స్వయంగా రంగంలోకి దిగి ఏం పంటలు పండించాలి? ఎలాంటి మందులు వాడాలి అనే నిర్ణయాలు కూడా ఆయనే తీసుకుంటారని కేసీఆర్ ఎర్రవల్లి క్షేత్రంలో పనిచేసేవాళ్ళు చెబుతుంటారు.
ఉద్యమంలో అనేకసార్లు కీలక పదవులకు రాజీనామా
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అనేకసార్లు తన పదవులను లెక్క చేయకుండా రాజీనామా చేశారు. 2001లో మొదటిసారి ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఆయన తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2006లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కి అదేవిధంగా కరీంనగర్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఉప ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. మరో వైపు రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్న అనేక సందర్భాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ మాత్రమే కాకుండా ఆయన వెంట నడిచిన పలువురు నాయకులు సైతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి చరిత్రలో నిలిచారు.



