సినిమా ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది బంగారం లాంటి అవకాశాలు వచ్చినా వాటిని వృధా చేసుకుంటారు. ఒకటి రెండు సినిమాలకే స్టార్ హీరోలు సినిమా చేసేందుకు వచ్చినా ..కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా చివరికి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేక నష్టపోతుంటారు. అలాంటి వారిలో రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన డైరెక్టర్లు సైతం ఉన్నారు. ఆ డైరెక్టర్లు ఎవరు… వాళ్ళు తీసిన సినిమాలు ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం…

 

తమిళ స్టార్ ఛాన్స్ ఇచ్చినా వేడుకోని అనుదీప్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ పిట్టగోడ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. చాలా తక్కువ బడ్జెట్ లో కొత్త ముఖాలతో ఈ సినిమాను తీశాడు. నిజానికి సినిమా యావరేజ్ గా ఉన్నా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత అనుదీప్ జాతి రత్నాలు అనే సినిమాను తెరకెక్కించాడు. నవీన్ పోలిశెట్టి హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటేనే భయపడ్డారు. కానీ జాతి రత్నాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో థియటర్లు నిండిపోయాయి. ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో అనుదీప్ కేవి పేరు మార్మోగిపోయింది. ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. జాతి రత్నాలు తీసిన తర్వాత తమిళ స్టార్ హీరో కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాను తీశాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. జాతి రత్నాలు తర్వాత వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను అనుదీప్ రీచ్ అవ్వలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత అనుదీప్ డైరెక్టర్ గా విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ అనే సినిమాను తీశారు. ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

మెగా ఛాన్స్ మిస్ యూజ్ చేసుకున్న బుచ్చిబాబు

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాకే మెగా ఫోన్ అందుకున్న బుచ్చిబాబు చిరంజీవి అల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమాను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం సాధించింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అంటూ పలువురు బడా హీరోల పేర్లు వినిపించాయి. కానీ చివరికి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టింది. సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించినా…భారీ బడ్జెట్ తో తీసినా సినిమా ఫ్లాప్ అవ్వడంతో బంగారం లాంటి అవకాశాన్ని బుచ్చిబాబు మిస్ చేసుకున్నారు.

పాన్ ఇండియా స్టార్ ఆఫర్ వాడుకోలేకపోయిన గీతూ మోహన్

ఇటీవల కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన గీతూ నటిగా హీరోయిన్ గా సినిమాలు చేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ తెరకెక్కించి ముథన్ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. నివీన్ పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ హిందీ క్రైమ్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా ఏళ్లకు రాకింగ్ స్టార్ యష్ హీరోగా టాక్సిక్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. ఈ సినిమాను వందల కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల నటీనటులతో తీశారు. అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మంచి అవకాశాన్ని గీతూ చేతులారా వృధా చేసుకున్నారు.

బుచ్చిబాబు దారిలోనే శ్రీకాంత్ ఓదెల

బుచ్చిబాబు తర్వాత సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాకే నాని లాంటి టైర్ 2 హీరో తో పాటు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఒప్పించాడు. వీరి కాంబినేషన్ లో దసరా సినిమా తెరపైకి రాగా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ నాని శ్రీకాంత్ పై నమ్మకంతో మరో సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చాడు. దీంతో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా మరో భారీ బడ్జెట్ చిత్రం ది పారడైజ్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాపై మొదటినుండి ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పోస్టర్లు, పాటలు ఎంతగానో ఆకట్టుకోవడంతో కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావించారు. కానీ సినిమా విడుదలైన తరవాత నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ కొడతాడు అనుకుంటే ప్రేక్షకులను నిరాశపర్చాడు. దీంతో బంగారం లాంటి ఛాన్స్ ను శ్రీకాంత్ కూడా మిస్ చేసుకున్నాడు.