ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందులో నటించే హీరోతో పాటు హీరోయిన్ కూడా ముఖ్యమే. ఇద్దరి జోడి బాగున్నప్పుడు, నటనతో మెప్పించినప్పుడే సినిమా హిట్ అవుతుంది. కాబట్టి సినిమా విజయంలో హీరోయిన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో హీరో కంటే హీరోయిన్ పాత్రనే సినిమా విజయానికి కారణం అవుతుంది. అయితే సినిమాల్లో అంతటి ముఖ్యమైన పాత్ర పోషించిన హీరోయిన్లు మాత్రం పెళ్లై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగానే గ్లామర్ ను పట్టించుకోరు. ఆఫర్లు రావడం లేదనో… ఇతర కారణాల వల్లనో గ్లామర్ పై అస్సలు దృష్టి పెట్టరు. కానీ ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు అలా చేయడం లేదు. టాలీవుడ్ ను ఊపు ఊపేసిన హీరోయిన్లు ఇప్పటికీ తమ గ్లామర్ తో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్నారు. అలా పెళ్లైనప్పటికీ గ్లామర్ ఏ మాత్రం తగ్గని టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
అందాల చందమామ కాజల్
టాలీవుడ్ లోకి లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తరవాత నటించిన చందమామ సినిమాతో కాజల్ కు హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. చందమామ తర్వాత రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇతర స్టార్ హీరోలు అందరి సరసన అవకాశాలు దక్కించుకుంది. కాజల్ అందానికి యువత ఫిదా అవ్వడమే కాకుండా ఆమె నటనతోను ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను 2020లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైనా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే అందం అదే ఫిట్నెస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.
మొదటి సినిమాతోనే మాయ చేసిన సమంత
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రేక్షకులను మాయ చేసేసింది. మొదటి సినిమాతోనే సమంత సూపర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మహేష్ బాబుతో నటించిన దూకుడు, రామ్ చరణ్ పక్కన నటించిన రంగస్థలం, పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది, విజయ్ కి జోడిగా నటించిన మెర్సల్, నాని తో చేసిన ఈగ సమంత కెరీర్ లోనే మంచి విజయాలు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సమంత డైరెక్టర్ రామ్ నిడిమోరును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో బిజీగా ఉంది. అయినప్పటికీ ఫిట్నెస్ గ్లామర్ విషయంలో ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు.
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ నయనతార
తెలుగుతోపాటు తమిళ మలయాళ సినిమాల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. తెలుగులో 2006లో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాతో నయనతార టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు హీరోయిన్ గా నయనతార నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుని ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అటు గ్లామర్ ఇటు ఫ్యామిలీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక నయనతార కోలీవుడ్ హీరో మరియు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైనప్పటికీ నయనతార గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
టాలీవుడ్ గ్లామర్ డాల్ శ్రేయ
తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి శ్రేయ. మొదట 2001లో ఇష్టం అనే సినిమాతో శ్రేయ టాలీవుడ్ కు పరిచయం అయింది. కానీ నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. సంతోషం సినిమా తర్వాత నువ్వే నువ్వే, ఠాగూర్, ఛత్రపతి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. శ్రేయ రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొష్చీవ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లై ఏళ్ళు గడుస్తున్నా, పిల్లలు ఉన్నా ఇప్పటికి గ్లామర్ ఫిట్నెస్ విషయంలో అస్సలు తగ్గటంలేదు.
అందాల వేడుక చూపించిన రకుల్ ప్రీత్ సింగ్
పెళ్లై వైవాహిక జీవితంలో ఫుల్ బిజీగా ఉన్నా అందం, ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ 2011లో కెరటం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంది. సరైనోడు, ధ్రువ, నాన్నకు ప్రేమతో సహా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆఫర్లు తగ్గినప్పటికీ ఫిట్నెస్, అందం విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు వ్యాపారంలోను రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతోంది.



